హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన వారం రోజుల మహిళా వారోత్సవాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మహిళా వారోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం సాకారం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల్లో కొత్త ఆత్మవిశ్వాసం, కొత్త ఆలోచనలు, సరికొత్త అవకాశాలు వెలుగులోకి వచ్చాయని ఆమె వివరించారు. గ్రామీణ మహిళలు ఇకపై కేవలం వ్యవసాయం, సూక్ష్మ వ్యాపారాలకే పరిమితం కాకుండా పారిశ్రామిక రంగం, విద్యుత్ ఉత్పత్తి, సేవారంగం, అలాగే నాయకత్వ స్థానాల్లోనూ రాణించగలరని ఈ వారోత్సవాలు నిరూపించాయని అన్నారు.
